సినిమాలను తలపిస్తున్న మహారాష్ట్ర రాజకీయాలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్ నేతలతో పాటు శరద్ పవార్‌కు ఊహించిన షాక్ ఇచ్చిన అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్సీపీలోని సగంమంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈనెల 30లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుకోవాలని గవర్నర భగత్‌సింగ్ కోశ్యారీ బీజేపీ సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష ఆసక్తికరంగా మారింది. ఫడ్నవిస్‌కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపకపోతే బలపరీక్షను ఎదుర్కొవడం సవాలే. దీంతో ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ, ఫడ్నవిస్‌ను అడ్డకునేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ముంబై వర్గాల సమాచారం. కానీ ఎన్సీపీ శాసన సభ్యులంతా తమకు మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీకి ఇక శరద్ పవార్ ఒక్కరే మిగిలి ఉన్నారని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది.