బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర ప్రమాదం


హైదరాబాద్‌ : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగన ఘోర ప్రమాదం పట్ల నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కృష్ణవేణి (40) అనే మహిళకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వేగ నియంత్రణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రమాద నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ ఫ్లైఓవర్‌పై రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో కృష్ణవేణితో పాటు ఆమె కుమార్తె కూడా గాయాలపాలైంది.

ఇక ఈ ఘటనపై మంత్రి కె.తారకరామారావు కూడా స్పందించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జీహెంఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ కారు పల్టీలు కొట్టి కిందపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. యాక్షన్‌ సినిమా గ్రాఫిక్స్‌ మాదిరి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ప్రమాద విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రమాద సమయంలో కారు గంటకు 104 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలం మొత్తం విషాదకర దృశ్యాలతో నిండిపోయింది.